EC 2023 Act: న్యాయస్థానం, చట్టసభల మధ్య అధికార సమతుల్యత..! 10 h ago
ప్రధాన ఎన్నికల కమీషనర్, ఇతర ఎన్నికల కమీషనర్లు (నియామకం, సర్వీస్ నిబంధనలు, పదవీకాలం) చట్టం, 2023 ప్రకారం చేపట్టిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎలక్షన్ కమిషనర్ల (ఈసీ) నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు శాసన నిర్మాణంలో 'న్యాయస్థానం అభిప్రాయం', 'చట్టసభల అధికారం' మధ్య దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి, ఎవరు సుప్రీం వంటి కీలకమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ప్రస్తుత వ్యాజ్యాన్ని పరిష్కరించడానికి.. రాజ్యాంగ అధికరణం 141 ప్రకారం, సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం, పార్లమెంటుకు ఉన్న శాసన నిర్మాణ అధికారాలలో ఏది సర్వోన్నతం అన్నది తేలాల్సి ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడుతూ తదుపరి విచారణకు ఫిబ్రవరి 4వ తేదీకి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం వాయిదా వేసింది.
పార్లమెంటు చట్టం చేసే వరకూ సీఈసీ, ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే కమిటీలో ప్రధాన మంత్రి, లోక్‌సభ విపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సభ్యులుగా ఉండాలని 2023 మార్చి 2న వెలువరించిన తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2023 చట్టంలో సీఈసీ, ఈసీల ఎంపిక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని చేర్చలేదని ప్రధాని, కేంద్ర క్యాబినెట్ మంత్రి, విపక్ష నేతను సభ్యులుగా పేర్కొందని పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వివరించారు.
•ఈ విధమైన కమిటీ కూర్పు వల్ల ఎన్నికల సంఘం ఏర్పాటులో ప్రభుత్వం మాటే చెల్లుబాటు అవుతుందని, ఎన్నికల కమిషన్ నిష్పాక్షికతను, పారదర్శకతను దెబ్బతీసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీ కాలం ఫిబ్రవరి 18న ముగుస్తుండటంతో న్యాయస్థానం వెంటనే జోక్యం చేసుకోకపోతే కొత్త చట్టం (2023) ప్రకారమే కేంద్ర ప్రభుత్వం నూతన సీఈసీని ఎంపిక చేస్తుందని వివరించారు.